BRS: ఫార్ములా వన్ ఈ-కార్ రేస్‌కు సంబంధించి అసెంబ్లీలో చర్చించాల్సిందే..! 1 d ago
TG : ఫార్ములా వన్ ఈ-కార్ రేస్‌కు సంబంధించి అసెంబ్లీలో చర్చించాల్సిందే అంటూ బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. దీంతో శుక్రవారం శాసనసభలో తీవ్ర గందరగోళం, అంతకుమించిన ఉద్రిక్తత చోటు చేసుకున్నది. ‘భూ భారతి బిల్లు రాష్ట్ర ప్రజలకు ఎంతో కీలకమైంది, దానిపై ముందుగా చర్చిద్దాం…’ అంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వారించినా.. వారు వెనక్కి తగ్గకపోవటంతో పలుమార్లు సభ వాయిదా పడింది. ‘గవర్నర్ అనుమతినిచ్చిన తర్వాత సభలో ఈ కార్-రేసుపై చర్చించే వీలులేదు.. కేసు ఏసీబీ పరిధిలో ఉంది కాబట్టి అసెంబ్లీలో చర్చించటం సాధ్యం కాదు…’ అని కాంగ్రెస్ సభ్యులు రేవూరి ప్రకాశ్‌రెడ్డి విడమరిచి చెప్పినా బీఆర్ఎస్ సభ్యులు తమ నినాదాలను ఆపకపోవటంతో స్పీకర్ వారిపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.
అత్యంత కీలకమైన భూ భారతి బిల్లుపై చర్చించేందుకు వీలుగా ప్రశ్నోత్తరాలను రద్దు చేసిన ఆయన నేరుగా బిల్లుపై చర్చను ప్రారంభించాలంటూ మంత్రి పొంగులేటికి సూచించారు. ఈ దశలో స్పీకర్ అనుమతితో బీఆర్ఎస్ సభ్యుడు తన్నీరు హరీశ్‌రావు జోక్యం చేసుకుంటూ.. ఫార్ములావన్ ఈ-కార్ రేసుపై అసెంబ్లీలో చర్చించటం ద్వారా ప్రజలకు వాస్తవాలను తెలపాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ రేసులో ఎలాంటి అవకతవకలు, అవినీతి జరగ లేదంటూ ఆయన స్పష్టం చేశారు. ‘ఈ కార్ రేస్‌లో అవినీతి జరిగిందని ప్రభుత్వం చెబుతోంది, జరగలేదని మేం చెబుతున్నాం, అందువల్ల దీనిపై సభలో చర్చిస్తే వాస్తవాలేంటో ప్రజలకు తెలుస్తాయని హరీశ్‌రావు తెలిపారు.
దీనికి అంగీకరించని స్పీకర్… భూ భారతి బిల్లుపై చర్చ తర్వాత తన ఛాంబర్‌కు అధికార, ప్రతిపక్ష సభ్యులను పిలిచి, ఏం చేయాలనే దానిపై చర్చిస్తానని హామీఇచ్చారు. అయినా సంతృప్తి చెందని బీఆర్ఎస్ సభ్యులు తమ స్థానాల్లో నిలబడి…’ఇదేమి రాజ్యం..ఇదేమి రాజ్యం..లాఠీల రాజ్యం..లూటీల రాజ్యం.. .ఇదేమి రాజ్యం..ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యం’ అంటూ పెద్దపెట్టున కొనసాగించారు. వారు ఒక్కసారిగా స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లారు. వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. వారిని తోసుకుంటూ బీఆర్ఎస్ సభ్యులు ముందుకెళ్లారు. వెంటనే బయట నుంచి ఎక్కువ సంఖ్యలో మార్షల్స్ వచ్చి బీఆర్ఎస్ సభ్యులను వెనక్కి నెట్టటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆ సమయంలోనే గుంపులో నుంచి కొందరు సభ్యులు పేపర్లను, పుస్తకాలను పైకి విసిరేశారు. చింపిన పేపర్లు కాంగ్రెస్ సభ్యుల వైపు వెదజల్లారు.
కాంగ్రెస్ సభ్యుడు వీరపల్లి శంకర్ తమవైపు వాటర్‌బాటిళ్లను, పేపర్లను విసిరారనీ, చెప్పు చూపారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ సభ్యులు ముందుకొచ్చే ప్రయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో సభను పావుగంట పాటు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. అయినా, సభలో ఉద్రిక్తత తగ్గలేదు. ఈ క్రమంలోనే మార్షల్స్ బీఆర్ఎస్ సభ్యులను పక్కకు తీసుకెళ్లారు. పాడి కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్ సభ్యుల వైపు చేయి చూపుతూ…‘ఏరు మంచిగా మాట్లాడు..బయటకు రా…అక్కడ చూపిస్తా..మీ అంతు చూస్తా’ అంటూ గట్టిగా అరిచారు. ఓ పది నిమిషాలు నిలబడి బీఆర్ఎస్ సభ్యులు బయటకు వెళ్లారు.
ఈ క్రమంలో ఉదయం 10.20 గంటలకు వాయిదాపడిన సభ తిరిగి 11.04 గంటలకు తిరిగి ప్రారంభమైంది. ‘బీఆర్ఎస్ సభ్యులను పిలిచి ప్రత్యేకంగా మాట్లాడుతా.. ఇలా చేయడం సరిగాదు. ముందు రాష్ట్ర రైతాంగానికి కీలకమైన భూభారతి బిల్లుపై మాట్లాడిన తర్వాత.. శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబుతో మాట్లాడి చర్చకు అవకాశం ఇస్తాం. దయచేసి సభ నిర్వహణకు సహకరించండి’ అని స్పీకర్ పదేపదే కోరినా బీఆర్ఎస్ సభ్యులు ఆగకుండా, ఓ…ఓ…ఓ…అంటూ అలాగే అరుస్తూ నిలబడ్డారు. బీఆర్ఎస్ సభ్యులు ఎంతకీ ఆగకుండా అరుస్తుండటంతో 11:30 గంటలకు స్పీకర్ సభను మరోసారి వాయిదా వేశారు.